80ఏళ్ల అవ్వ చేస్తున్న సేవకు చలించిన ఆనంద్ మహీంద్రా.. అంతటితో ఆగకుండా..

  0
  471

  80 ఏళ్ల వయసున్న ఓ అవ్వకు సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆనంద్ మహీంద్ర ఆ అవ్వ వివరాలు కనుక్కోవాలంటూ నెటిజన్లను కోరాడంటే ఆ అవ్వ చేస్తున్న పనేంటో తెలుసు కోవాలని వుంది కదా.. మనలను ఆశ్చర్యచకితులను చేసే అద్భుత గాథల్లో ఇది కూడా ఒకటి.

  కమలతల్ అనే వయసుమళ్ళిన ఆ అవ్వ స్వస్థలం తమిళనాడులోని పెరూ సమీపంలో వడివేలంపాళ్యం. ఆమె చట్నీ, సాంబార్‌తో కలిపి ఒక్కో ఇడ్లీ రూపాయికే అమ్ముతూ అనేక మందికి పొట్టనింపుతున్నారు. 35 ఏళ్లుగా కమలతల్ ఇదే రీతిలో సేవలందిస్తున్నారు. రోజూ సూర్యోదయానికి ముందే లేచి ఆమె తన పని మొదలు పెడతారు. తక్కువ ధరకే ఇడ్లీలు అందించడానికి కారణం ఏంటని అడిగితే.. రోజువారీ కూలీలు పొట్టనిండా తిని , డబ్బులు ఆదా చేసుకోవడమేనని ఆమె సమాధానం చెబుతారు. గతంలో కమలతల్ ఒక్కో ఇడ్లీ అర్థరూపాయికే అమ్మేవారు. అయితే ఇప్పుడు సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో ఒక్క రూపాయికి అమ్ముతున్నారు. రోజుకు వెయ్యి ఇడ్లీలకు పైగా అమ్ముతున్న ఆమె…‘‘లాభం నాకు ముఖ్యం కాదు.. అందరి ఆకలి తీర్చాలన్న కోరికే వారిని నా ఇంటికి రప్పిస్తుందని ఆమె అంటుంది.

  అయితే.. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి సోషల్ మీడియా గూటికి చేరింది. సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా వుండే ఆనంద్ మహీంద్రా.. ‘కమలతల్ లాంటి వాళ్లు చేసే పనిలో కొంత చేసినా ఎంతో మందికి మేలు జరుగుతుంది. ఆమె ఇప్పటికీ కట్టెల పొయ్యినే వాడుతున్నట్టు నేను గుర్తించాను. ఆమె ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సంతోషంగా ఆమె వ్యాపారంలో ‘పెట్టుబడి’ పెట్టి, ఎల్పీజీ గ్యాస్ స్టవ్ కొనిపెడతా..’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

  ఇకపోతే.. ఆయన పిలుపుపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సైతం స్పందించింది. ‘‘బాగా చెప్పారు సర్. దేశం కోసం ఇండియన్ ఆయిల్‌ ఏ స్ఫూర్తితో పనిచేస్తుందో దాన్ని తన సామాజిక సేవతో ఆమె మరింత ప్రతిధ్వనింప చేస్తున్నారు…’’ అని పేర్కొంది. ఆమెకు ఇండేన్ ఎల్పీజీ సిలిండర్‌తో పాటు గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్ అందజేసిట్టు వెల్లడించింది.

  కాగా స్థానికుడొకరు మాట్లాడుతూ… ‘‘బామ్మ ఎంతో రుచిగా ఇడ్లీ అందిస్తున్నారు. కొంతమంది పది రూపాయల ఇడ్లీ తిని ఐదు రూపాయలే ఇస్తారు. మరికొంత మంది అసలు ఇవ్వరు. అయినా బామ్మ వారిని ఏమీ అనదు. బామ్మ జీవించినంత కాలం వారికి ఇక్కడ తిండి దొరుకుతుంది…’’ అని పేర్కొన్నారు.