పల్నాడులో చంద్రబాబు కుట్ర రాజకీయాలు

ఏపీలోని గుంటూరు జిల్లా పల్నాడు అల్లకల్లోలం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

0
108

ఏపీలోని గుంటూరు జిల్లా పల్నాడు అల్లకల్లోలం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీ ఓర్వలేకపోతోందని, దీంతో వైసీపీకి చెడ్డ పేరు రావాలనే ఉద్దేశంతో ప్రజల్లో చంద్రబాబు కుట్ర రాజకీయాలకు దిగుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గురజాలలోని అక్రమ మైనింగ్‌ వ్యవహరాన్ని సీబీఐకి బదిలీ చేయడంతో చంద్రబాబు, అండ్‌ కో లొసుగులు బయటకు వస్తాయనే భయం పట్టుకుందని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు అనేక అక్రమాలకు పాల్పడి.. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన టీడీపీ నేతలపై తాజా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణను రాజకీయ వేధింపులుగా చూపించే ప్రయత్నం చేయడం కోసం.. వైఎస్సార్‌సీపీ నేతలు తమపై దాడులకు పాల్పడుతున్నారంటూ కొందరు టీడీపీ నేతలు అసత్య ప్రచారానికి దిగుతున్నారని వారు విమర్శిస్తున్నారు.

అక్రమ మైనింగ్ వ్యవహారంలో…

మరోవైపు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై కూడా ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమ మైనింగ్‌ వ్యవహరాన్ని సీబీఐకి బదిలీ చేసింది. బ్యాంకు ఖాతాల్లో భారీగా జరిగిన అక్రమ ఆర్థిక లావాదేవీల చిట్టాలు ఒక్కొక్కటీ బయటపడతుండటంతో టీడీపీ నేతల్లో అలజడి మొదలైంది. ఐదేళ్ల పాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించామని, ఆ కష్టాలు పగవారికి కూడా రాకూడదు అంటూ యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల దాడులకు గురైన బాధితులు హోంమంత్రి సుచరిత ఎదుట ఇటీవల తమ గోడు వెళ్లబోసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఐదేళ్ల టీడీపీ పాలనలో యరపతినేని, ఆయన అనుచరుల వేధింపులకు గురైన బాధితుల కష్టాలు, బాధలు విన్న హోం మంత్రి వారికి భరోసా ఇచ్చారు. వారిపై నమోదు అయిన కేసులపై తిరిగి విచారణ చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు కూడా. దీంతో పల్నాడులోని టీడీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ బాగోతం అసెంబ్లీ ఫర్నీచర్‌ దోపిడీ రూపంలో గుంటూరు జిల్లాలో టీడీపీ పరువు రోడ్డున పడింది. జిల్లాలో వ్యాప్తంగా పార్టీ పూర్తిగా పతానావస్థకు చేరడంతో సైకిల్ పార్టీల నేతలు అనేక దుశ్చర్యలకు పాల్పడుతూ.. ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి దిగుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.