సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాలకే జైలుశిక్ష

  తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. అన్యాయాన్ని ఎదిరిస్తేనే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అని సగర్వంగా ప్రకటించిన ఉద్యమ వీరుడు ప్రజాకవి కాళోజీ. 1914 సెప్టెంబర్ 9న కర్నాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో

  0
  95

  -తరతరాలుగా అందరి గుండెల్లో నిలిచిపోయిన ‘కాళోజి’

  -నేడు కాళోజి నారాయణ రావు జయంతి

  మనుషులు పుడతారు….మరణిస్తారు….కానీ కొంతమంది మాత్రమే తమ జీవితాన్ని జాతికి అంకితం చేస్తారు. తరతరాలుగా అందరి గుండెల్లో నిలిచిపోతారు.  అలాంటి వారు నూటికో కోటికో ఒక్కరు.  వారిలో గుర్తుంచుకునే పేరు కాళోజీ నారాయణరావు. నేడు కాళోజీ జ‌యంతి..

  తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. అన్యాయాన్ని ఎదిరిస్తేనే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అని సగర్వంగా ప్రకటించిన ఉద్యమ వీరుడు ప్రజాకవి కాళోజీ. 1914 సెప్టెంబర్ 9న కర్నాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు కాళోజీ. తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రచయితగా ప్రఖ్యాంతిగాంచారు కాళోజీ. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో ఆయన దిట్ట. కాళోజీ ‘ నా గొడవ’ సమకాలీన సామాజిక సమస్యలపై పూరించిన సమరశంఖం.. అక్షర ఆయుధం లాంటిది.

  బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడంది. హైదరాబాద్ పాతబస్తీలోని చౌమహల్లా పాఠశాలలో చదివిన కాళోజీ.. సిటీ కాలేజీ, హన్మకొండ కాలేజియేట్ హైస్కూల్ లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 1939 లో హైదరాబాద్ హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కాలేజీలో న్యాయశాస్త్రం పట్టా పొందారు. 1930 నాటి గ్రంథాలయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాలకే జైలుశిక్ష అనుభవించారు. హైదరాబాదు స్టేట్ కాంగ్రెసుతో కాళోజీ అనుబంధం విడదీయరానిది. 1940 లో రుక్మిణీబాయితో వివాహం జరిగింది

  మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, పీవీ నరసింహారావు వంటి వారితో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు కాళోజీ. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్రా సారస్వత పరిషత్తును స్థాపించిన వారిలో కాళోజీ ఒకరు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945 లో పరిషత్తు ద్వితీయ మహాసభలను నిర్వహించారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించి నగర బహిష్కరణ శిక్షకు గురయ్యారు. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పని సామాన్యుడే తన దేవుడని ప్రకటించారు కాళోజీ. తన రచనలతో యావత్ సమాజాన్ని జాగృతం చేశారు. అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు .. సకిలించు ఆంధ్రుడా చావవేటికిరా అంటూ ఆయన సంధించిన భాషా బాణం.. ఎందరికో మాతృభాషపట్ల ప్రేమను రగిల్చింది. 1992లో కాళోజీకి భారత రెండవ అత్యున్నత పురస్కారమై పద్మవిభూషణ్ లభించింది. కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ వారు 1992లో కాళోజీకి డాక్టరేట్ ప్రదానం చేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళోజీ జయంతిని ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోంది.

  అణా కథలు,  నా భారతదేశయాత్ర,  పార్థివ వ్యయము, కాళోజి కథలు,  నా గొడవ,  జీవన గీత,  తుదివిజయం మనది, తెలంగాణ ఉద్యమ కవితలు,  ఇదీ నా గొడవ, బాపూ! బాపూ! బాపూ!, ఇలా ఎన్నో రచనలు చేశారు కాళోజీ. అందులో ప్రతి దశలోనూ సామాన్యుల గొంతుకగా నిలిచారు. అట్టడుగు వర్గాలకు అండగా ఉన్నారు. నమ్మిన సిద్దాంతాలకోసం జీవితాంతం నిలిచిన మహనీయులు కాళోజీ నారాయణరావు. 2002  నవంబర్ 13న ఆయన తుదిశ్వాస విడిచారు. నా గొడవ అంటూ.. పెత్తం దార్లు, అవినీతి రాజకీయ నేతలకు ఎదురొడ్డిన ఆయన ధైర్యం, తెగువ అందరికీ ఆదర్శం.

  కాళోజి అందుకున్న గౌరవాలు:

  1968 : “జీవన గీత” రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అనువాద పురస్కారం

  1972 : తామ్రపత్ర పురస్కారం

  బూర్గుల రామకృష్ణారావు మెమోరియల్ మొదటి పురస్కారం

  1981 : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే 1981లో సత్కారం.”ప్రజాకవి” బిరుదు

  గాడిచర్ల ఫౌండేషన్ అవార్డు

  1992లో: పద్మవిభూషణ్ – భారత రెండవ అత్యున్నత పురస్కారం

  1992 : కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ వారు డాక్టరేట్ ప్రదానం చేసారు

  1996లో సహృదయ సాహితీ విశాఖ వారి గురజాడ అవార్డు

  1996లో కళసాగర్ మద్రాస్ వారి విశిష్ట పురస్కారం