చంద్రయాన్- 2 కు.. చంద్రశేఖర్ రావు బడ్జెట్ కు లింకు కలిపిన రాములమ్మ!

0
138

సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే ఆయన బడ్జెట్‌పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి పేస్ బుక్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వాస్తవాలు కనిపించడం లేవని ఎద్దేవా చేశారు. పేదలకు భరోసా కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు.

‘చంద్రయాన్-2లో ల్యాండర్ విక్రమ్ జాడను కనుక్కోవచ్చేమో గానీ, కెసిఆర్.. తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించిన వాస్తవాలను కనుక్కోవడం ఎవరి తరం కాదేమో అన్న అనుమానం కలుగుతోంది. గత ఏడాది కూడా లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌ను టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ.. అక్షరాస్యత కల్పించడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అట్టడుగులో ఉందని సర్వేలో తేలింది. తెలంగాణలోని పేదలకు వైద్యం అందించే విషయంలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అందరూ చూశారు. విష జ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస సదుపాయాలు లేకపోవడం.. ఆరోగ్యశ్రీ బిల్లులను పెండింగ్‌లో పెట్టడం వంటి నిర్లక్ష్య ధోరణితో.. పేద రోగుల జీవితాలతో ఏ రకంగా ఆడుకున్నారో అందరికీ అర్థం అయింది. చివరకు రైతులకు యూరియా అందించే విషయంలో కూడా కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. ఇలా విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు గత బడ్జెట్‌లో పెద్దపీట వేశామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ప్రభుత్వం.. ప్రధాన రంగాలను ఏ రకంగా గాలికి వదిలేసిందనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు. మరి, ఈ కీలక రంగాలకు కేటాయించిన బడ్జెట్ నిధులు ఏమయ్యాయి? అనే ప్రశ్నకు టీఆర్ఎస్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. గత బడ్జెట్ లెక్కలు తేలకముందే.. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు కొత్త బడ్జెట్ పేరుతో గారడికి సిద్ధమయ్యారు. కెసిఆర్ గారి లెక్క, పద్దుల విషయం ఏమోగానీ.. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధుల వినియోగంలో జరిగిన అవకతవకలపై లెక్క తేల్చేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారని వారి ప్రకటనల ద్వారా అర్ధం అవుతోంది. మరి ఎవరి లెక్క ముందు తేలుతుందో వేచి చూడాలి’’ అని తన ఫేస్‌బుక్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేసారు.