ముందు హరీష్ రావే.. తర్వాతే తనయుడు..

0
117

రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొట్టమొదటగా తన్నీరు హరీశ్ రావు ప్రమాణ స్వీకారం చేసి, సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. తర్వాత కల్వకుంట్ల తారకరామారావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చివరికి గవర్నర్, సీఎం కేసీఆర్‌, మంత్రుల బృందం రాజ్‌భవన్‌లో గ్రూప్ ఫోటో దిగారు.

ఇకపొతే.. హరీశ్‌రావుకు కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యలు అప్పగించనున్నట్లు తెలుస్తుంది. ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి తప్పిస్తారని ప్రచారం జరిగినప్పటికీ శాఖ మార్పుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈటలను ఆరోగ్యశాఖ నుంచి విద్యాశాఖకు మార్చే అవకాశం ఉన్నట్లు భోగట్టా. కేటీఆర్‌కు ఐటీ, మున్సిపల్‌ శాఖ, సబితకు హోంశాఖ కేటాయించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అదేగానీ జరిగితే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హోం శాఖ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళా మంత్రిగా, తెలంగాణ తొలి మహిళా హోం మంత్రిగా సబితా నిలిచిపోనున్నారు. పువ్వాడ అజయ్‌కు వైద్య, ఆరోగ్యశాఖ ఇచ్చే అవకాశం, సత్యవతి రాథోడ్‌కు స్త్రీశిశు, గిరిజన సంక్షేమ శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.