ఆయన నన్ను సీఎంలా చూడలేదు.. తమ్ముడిలా ఆదరించారు

  0
  64

  తెలంగాణ ఉద్యమ నేపథ్యం, రాష్ట్ర అవతరణ, కొత్త రాష్ట్రం ప్రస్థానం పూర్తిగా తెలిసిన నరసింహన్‌ సేవలు కోల్పోవడం అత్యంత బాధగా ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎప్పటికప్పుడు వెన్నుతట్టి ధైర్యం చెప్పి స్ఫూర్తి నింపిన నరసింహన్‌తో అనేక గొప్ప జ్ఞాపకాలున్నాయని కేసీఆర్‌ తెలిపారు. వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా గవర్నర్‌తో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. ”రాజ్‌భవన్‌లో గవర్నర్‌ దంపతులు ప్రతీ పండుగను గొప్పగా నిర్వహించేవారు. నరసింహన్‌ ఇచ్చిన స్ఫూర్తిని, మార్గదర్శకత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం. గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో మొదట సమైక్య ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా తర్వాత రెండు రాష్ట్రాల గవర్నర్‌గా.. చివరికి తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్‌ మూడు రకాల బాధ్యతలు నిర్వర్తించారు. నేను ఉద్యమకారుడిగా, సీఎంగా రెండు రకాల బాధ్యతలు నిర్వర్తించాను. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో మాజీ ఐపీఎస్‌ అధికారి అయిన నరసింహన్‌ గవర్నర్‌గా వచ్చారు. ఉద్యమాన్ని అణచివేయడానికే వచ్చారనే భయం నాడు కొందరిలో ఉండేది. అదే సమయంలో నేనే నరసింహన్‌ను కలిశాను. ఉద్యమ నేపథ్యాన్ని, ఉద్యమం సజీవంగా ఉండడానికి గల కారణాలను గవర్నర్‌ నరసింహన్‌ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఉద్యమం గురించి, ఇక్కడి ప్రజల డిమాండ్ల గురించి కేంద్రానికి సరైన నివేదికలు పంపి న్యాయం చేస్తారనే నమ్మకం నాకున్నదని నేను తొలినాళ్లలోనే నరసింహన్‌పై విశ్వాసం వ్యక్తం చేశాను.” అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

  ESLNarasimhan1

  ”నరసింహన్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే తెలంగాణ వచ్చింది. ఆయన హయాంలోనే టీఆర్‌ఎస్‌ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. గవర్నర్‌ నన్ను సీఎంలా కాకుండా తమ్ముడిలా ఆదరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల మంచి, చెడులను ఎప్పటికప్పుడు చర్చించేవారు. పథకాల ఉద్దేశాలను తెలుసుకునేవారు. రాష్ట్ర ఆర్థికపరిస్థితిని వాకబు చేసేవారు. కేసీఆర్‌ కిట్స్‌, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, హరితహారం మిషన్‌భగీరథ లాంటి పథకాలు ఆయనకు ఎంతో బాగా నచ్చాయి. తలపెట్టిన ప్రతీ పని విజయవంతం కావాలని తపన పడేవారు. గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌కు ప్రజావేదికగా మార్చారు. ఎవరైనా వెళ్లి తమ సమస్యలు చెప్పుకోవడానికి వీలు కలిగేది. తెలంగాణ ప్రభుత్వం చేసే మంచి పనులను కేంద్ర మంత్రులకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు నరసింహన్‌ వివరించేవారు. యాదాద్రి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టినప్పుడు గవర్నర్‌ దంపతులు ఎంతో నిష్టతో మడికట్టుకుని పూజల్లో పాల్గొన్నారు. సోదరభావంతో గవర్నర్‌ నరసింహన్‌కు పాదాభివందనం చేసి యాదాద్రి పునరుద్ధరణ పని ప్రారంభించాను. యాదాద్రి పునరుద్ధరణ విజయవంతంగా కొనసాగుతోందని” సీఎం పేర్కొన్నారు.

  గవర్నర్‌ నరసింహన్‌కు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు ఏర్పాట్లు చేసింది. బేగంపేట విమానాశ్రయంలో నరసింహన్‌కు సీఎం కేసీఆర్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు వీడ్కోలు పలికారు. ఎయిర్‌పోర్టులో నరసింహన్‌ పోలీసుల నుంచి వీడ్కోలు గౌరవవందనం స్వీకరించారు. అంతకుముందు ప్రగతిభవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌కు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ దంపతులు గవర్నర్‌ దంపతులను సత్కరించారు.