అసలేమైంది…? చంద్రయాన్-2పై ఇస్రో కీలక ప్రకటన

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌–2లో చివరి క్షణంలో సాంకేతిక సమస్య ఎదురైన విషయం తెలిసిందే. శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌ విక్రమ్‌ జాబిల్లి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ఇస్రో భూకేంద్రంతో

0
129

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌–2లో చివరి క్షణంలో సాంకేతిక సమస్య ఎదురైన విషయం తెలిసిందే. శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌ విక్రమ్‌ జాబిల్లి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ఇస్రో భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఎంతో ఆసక్తితో ప్రయోగాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తల్లో నిరాశ ఏర్పడింది. ఏమైందో తెలియని పరిస్థితి. ఒక్కసారిగా టెన్షన్ లో పడిపోయారు. ఈ నేపథ్యంలో ఇటు దేశ ప్రజలు, అటు శాస్త్రసాంకేతిక నిపుణుల్లో నైతికస్థైర్యం నింపేలా ఇస్రో కీలక ప్రకటన చేసింది.

చంద్రయాన్‌–2 ప్రయోగానికి సంబంధించి 90 నుంచి 95 శాతం లక్ష్యాలను అందుకున్నామని, చంద్రుడికి సంబంధించి తమ పరిశోధనలు కొనసాగుతాయని తెలియజేసింది. అయితే విక్రమ్‌ ల్యాండర్‌ అనుకున్న ప్రకారం తన వేగాన్ని తగ్గించుకుని చంద్రుడికి 2.1 కి.మీ దగ్గరకు సమీపించగానే సిగ్నల్స్ తెగిపోయాయి. రాబోయే 14 రోజుల్లో విక్రమ్‌తో కమ్యూనికేషన్‌ సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తామని పేర్కొంది. ఈ ప్రయోగానికి సంబంధించిన డేటాను తాము ప్రస్తుతం విశ్లేషిస్తున్నామని వివరించింది.

ఏడు సంవత్సరాల పాటు ఆర్బిటర్‌ సేవలు..

చంద్రయాన్‌–2 ప్రయోగానికి సంబంధించి ఇస్రో కీలక విషయాన్ని ప్రకటించింది. ఇందులో ప్రయోగించిన ఆర్బిటర్‌ జీవితకాలం ఏడు రెట్లు పెరిగిందని ఇస్రో పేర్కొంది. అయితే. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్వీ మార్క్‌–3 వాహకనౌక ద్వారా ఈ ఏడాది జూలై 22న చంద్రయాన్‌–2ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రయోగించిన ఆర్బిటర్‌ జీవితకాలం 12 నెలలు కాగా, ఇప్పుడు ఏడేళ్ల పాటు పనిచేసే అవకాశముందని ఇస్రో వివరించింది. వాహకనౌకను అత్యంత కచ్చితత్వంతో ప్రయోగించడం, మిషన్‌ నిర్వహణ పద్ధతుల కారణంగా ఆర్బిటర్‌ జీవితకాలం 7 సంవత్సరాలు పెరిగిందని, చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో మార్పులు, ఖనిజాలు, నీటి అణువులను ఈ ఆర్బిటర్‌ విశ్లేషిస్తుందని చెప్పింది. ఇందులోవాడిన అంత్యంత శక్తిమంతమన కెమెరా, చంద్రుడికి సంబంధించిన కీలక ఫొటోలను చిత్రీకరిస్తుందని ఇస్రో పేర్కొంది.

సమస్య ఎక్కడొచ్చింది..!..ఇస్రో మాజీ చైర్మన్ ఏమన్నారు

విక్రమ్‌ ల్యాండర్‌తో సమాచారం తెగిపోయేందుకు ఒకటి కంటే ఎక్కువ కారణాలు ఉండవచ్చునని ఇస్రో మాజీ ఛైర్మన్‌ మాధవన్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు. సెన్సర్లు పనిచేయకపోవడం మొదలుకొని, విక్రమ్‌లోని సాఫ్ట్‌వేర్‌ పనితీరులో తేడాలు, చివరి సెకనులో ఇంజిన్లు అందించే థ్రస్ట్‌ లో మార్పులు వంటి కారణాలు కూడా ఉండే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు కారణమేదో ఇస్రో సమాచార విశ్లేషణతో తెలుస్తుందన్నారు. విక్రమ్‌ ప్రయాణించాల్సిన మార్గం, వేగాల్లో తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెగిపోయేంత వరకూ ఉన్న వివరాలను పరిశీలిస్తే కారణమేమిటో తెలియకపోదు అని ఆయన అన్నారు.