తెలంగాణ ‘రాములమ్మ’ ఆ పదవి కోసమేనా ఆరాటం…!

తెలంగాణలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా పేరున్న రాములమ్మ..అలియాస్ విజయశాంతి ఈ మధ్య మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. అవకాశం వస్తే చాలు.. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఓ రేంజ్ లో కుమ్మేస్తోంది.

0
122

తెలంగాణలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా పేరున్న రాములమ్మ..అలియాస్ విజయశాంతి ఈ మధ్య మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. అవకాశం వస్తే చాలు.. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఓ రేంజ్ లో కుమ్మేస్తోంది. మొన్న ఈటెల రాజేందర్, కేటఆర్‌, హరీష్ రావులను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు…ఈ మధ్య అంతా ట్విట్టర్ వేదికగా రాజకీయాంశాలు కొనసాగుతుంటే… మాత్రం ఫేస్‌బుక్ వేదికగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తోంది.

అయతే తాజాగా మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాములమ్మ. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో జరిగిన శిల్పాల వివాదంలో తనదైన రీతిలో స్పందించారు. ఆలయంలోని శిలలపై కేసీఆర్, కారు, ప్రభుత్వ పథకాలకు చెందిన బొమ్మల్ని చెక్కిన వైనం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల ముందు సారు..కారు.. పదహారు.. సర్కారు అంటూ నినాదాన్ని అదే పనిగా వినిపించటం వెనుక అసలు రహస్యం ఏమిటో తనకు అర్థమైందని.. విజయశాంతి తన అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్ చేశారు. ఆ పోస్టు సారాంశమిది.

“ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌గారు పదేపదే సారు… కారు.. సర్కార్ అనే డైలాగ్ వాడటం వెనుక ఆంతర్యం ఏమిటో ఇప్పుడు అర్థం అయింది. ఎంతో పవిత్రమైన యాదగిరిగుట్టలో చేపడుతున్న ఆధునీకరణలో భాగంగా అక్కడ నిర్మిస్తున్న స్థూపాలలో దేవతామూర్తులతో పాటు కేసీఆర్ సార్ బొమ్మను.. కార్ గుర్తును.. టీఆర్ఎస్ సర్కార్ గుర్తును చెక్కడం ద్వారా.. కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారని అర్థం అవుతోంది. రాజులు, రాజ్యాలు కనుమరుగైన తర్వాత కూడా కేసిఆర్‌గారు తన దొరతనాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ప్రతిపక్షాలు ఈ విషయంపై చేసే ప్రకటనలను కేసీఆర్ గారు రాజకీయ కోణంలో చూసి.. వాటిని లైట్‌గా తీసుకునే ప్రమాదం ఉంది. తిరుమలతో సమానంగా తెలంగాణలో యాదగిరిగుట్టను కూడా ఇక్కడి ప్రజలు ఎంతో పవిత్ర క్షేత్రంగా నమ్ముతారు. మరి అలాంటి పవిత్ర క్షేత్రాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకుంటూ.. ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తున్న నియంతృత్వ తీరుపై మఠాధిపతులు, పీఠాధిపతులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధర్మో రక్షతి రక్షితః అనే నానుడికి తగ్గట్లు హైందవ ధర్మాన్ని కాపాడే పెద్దలు టిఆర్ఎస్ పాలకులకు కనువిప్పు కలిగిస్తారని ఆశిస్తున్నాను”…అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో రాసుకొచ్చారు విజయశాంతి.