‘చంద్రయాన్‌–2’ విఫలం కాలేదట

    0
    236

    చంద్రుడి భూ ఉపరితలంపై ఇస్రో పంపించిన ఉపగ్రహం ‘చంద్రయాన్‌–2’ చివరి నిమిషంలో విఫలం అవడం పట్ల ఇస్రో చైర్మన్‌ కే. శివన్, ఇతర శాస్త్రవేత్తలు తీవ్రంగా నిరాశ చెందడం, వారిని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఓదార్చడం తెల్సిందే. అయితే.. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోకి ‘విక్రమ్‌ ల్యాండర్‌’ దూసుకుపోవడం సాధారణ విషయం కాదని, దీన్ని సక్సెస్‌ కిందనే పరిగణించాల్సి ఉంటుందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. ఈ దిశగా భారత శాస్త్రవేత్తలు చేసిన కృషిని వారు అభినందించారు. ఇక చంద్రుడి ఉపరితలంపై ఉపగ్రహాన్ని దించే మూడవ ప్రక్రియలోనూ భారత్‌ తదుపరి ప్రయత్నంలో విజయం సాధిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

    ఇదిలావుంటే.. ఈ ప్రయోగంలో రెండు ప్రధాన దశలు ఉన్నాయి. మొదటి దశ చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ప్రారంభమయ్యే 30 కిలోమీటర్ల దూరం వరకు ఉపగ్రహాన్ని తీసుకెళ్లడం, రెండో దశ చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోకి తీసుకెళ్లడం. ఈ రెండో దశనే కాస్త క్లిష్టమైనది. చంద్రుడికి కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయింది. మొదటి దశలో చంద్రయాన్‌ ఉపగ్రహం అంతరిక్షంలో 3,84,400 కిలోమీటర్లు సునాయాసంగా ప్రయాణించి రెండో దశలోనూ, అంటే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోనికి కూడా 28 కిలోమీటర్లు చొచ్చుకొని పోయింది. కాబట్టి చంద్రయాన్‌–2 విఫలమైందని చెప్పడానికి బదులు విజయవంతమైందనే విషయాన్నే ఎక్కువ చెప్పాలి.