అసలేమైయుంటుంది.. కుటుంబ గొడవలా..? ఉపాధ్యాయుల వేధింపులా..?

    0
    91

    తమిళనాడులోని మదురైలో ఉండే ఓ ప్రైవేటు స్కూల్ తరగతి గదిలో చోటుచేసుకున్న సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి బయల్దేరిన అమ్మాయి కొద్దిసేపట్లోనే తరగతి గదిలో శవంగా మారడం చూసి అమ్మాయి అమ్మానాన్నలు షాక్ గురయ్యారు. వివరాల్లోకెళితే.. మదురై సమీపంలోని కె.పుదూర్‌ గాంధీపురానికి చెందిన ముత్తు, సుందరి దంపతుల రెండో కుమార్తె (16) అదే ప్రాంతం లో వున్న ప్రైవేటు పాఠశాలో ప్లస్‌వన్‌ చదువుతోంది. శుక్రవారం ఉదయం ఆమె రోజులాగే పాఠశాలకు బయల్దేరి వెళ్లింది. తరగతులు ప్రారంభం కావడానికి ముందే పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని నేరుగా తరగతి గదికి వెళ్ళింది. కొద్దిసేపటి తరువాత తోటి విద్యార్థులు తరగతి గదికి వెళ్లేసరికి.. సహ విద్యార్థిని ఉరిపోసుకుని శవంగా వేలాడుతుండటం చూసి బిగ్గరగా కేకలు పెట్టారు. వెంటనే ఉపాధ్యాయులు అక్కడకు చేరుకుని ఈ సంఘటన గురించి పుదూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి, ముందస్తు జాగ్రత్తగా పాఠశాలకు సెలవు ప్రకటించారు.

    ఈలోగా.. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పెద్దసంఖ్యలో తరలివచ్చి పాఠశాలను ముట్టడించి అందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి విద్యార్థిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్డం నిమిత్తం తరలించేందుకు ప్రయత్నించారు. కానీ బంధువులు అడ్డుకుని తమ కూతురు ఆత్మహత్యకు గల కారణాలు తెలిసేంతవరకూ మృతదేహన్ని తరలించకూడదని పట్టు బట్టారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకదశలో పోలీసులు లాఠిఛార్జీ జరిపి అందరినీ తరిమికొట్టారు. ఆ సమయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని విద్యార్థిని మృతిపై సమగ్రంగా విచారణ జరుపుతామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. విద్యార్థిని కుటుంబ తగాదాల కారణంగా ఆత్మహత్య చేసుకుందా.. లేక ఉపాధ్యాయుల వేధింపుల కారణంగా ఉరిపోసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.