పూజారి కాబోయి రాష్ట్రపతి అయ్యారు

  ఆయనో ఆసాధారణ ప్రజ్ఞాశాలి, విద్యావేత్త. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా (1962 నుంచి 67) పదవులకే వన్నెతెచ్చిన 'భారతరత్నం'. ఆయనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.

  0
  76

  -సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం

  – అరిటాకు లేక నేలమీద అన్నం తిన్నారు

  – భోజనం ఎదురుగా ఉన్నా.. మంచినీరే తాగారు..

  ఆయనో ఆసాధారణ ప్రజ్ఞాశాలి, విద్యావేత్త. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా (1962 నుంచి 67) పదవులకే వన్నెతెచ్చిన ‘భారతరత్నం’. ఆయనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. తత్వవేత్తలు రాజ్యాధిపతులైనప్పుడు ఆదర్శ రాజ్యం ఏర్పడి దేశంలో సుఖశాంతులు విలసిల్లుతాయి…అన్న గ్రీక్ తత్వవేత్త ప్లేటో వ్యాఖ్యలకు రాధాకృష్ణనే నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు.

  సర్వేపల్లి జననం:

  సర్వేపల్లి రాథాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5వ తేదీన తిరుపతి సమీపంలోని తిరుత్తణి గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతుల కుమారుడైన రాథాకృష్ణన్ తొలినాళ్లు తిరుత్తణి, తిరుపతిలోనే గడిచాయి. తండ్రి స్థానిక జమిందార్ వద్ద సబార్డినేట్ రెవెన్యూ అధికారిగా ఉండటంతో రాథాకృష్ణన్ ప్రాథమిక విద్య తిరుత్తణిలోని కెవి హైస్కూలులో జరిగింది. 1896లో తిరుపతిలోని హెర్‌మన్స్‌బర్గ్ ఎవాంజిలికల్ లూథరన్ మిషన్ స్కూలులోనూ, వాలాజీపేట్‌లోని ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూలులోనూ కొనసాగింది. ఆయన చదువంతా స్కాలర్‌షిప్‌లతోనే కొనసాగింది. ఆయనలోని ప్రతిభ ఏమిటో అవగతం చేసుకోవచ్చు. పదహారేళ్ల ప్రాయంలో పెద్దలు కుదిర్చిన తన దూరపు బంధువైన శివకామును రాథాకృష్ణన్ పెళ్లాడారు. వీరికి గోపాల్ అనే కుమారుడుతో పాటు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. కేవలం రూ.17 జీతంతో అతి కష్టంగా కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు రాధాకృష్ణన్.

  అరిటాకులు కొనలేక… నేల మీదే వడ్డించుకున్నారు

  సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించిన తొలిరోజుల్లో అన్నం తినడానికి ఒక పళ్ళెం కూడా కొనుక్కునే స్థోమత లేక అరిటాకులపై భోజనం చేసేవారట. ఒక్కోసారి అరిటాకులు కొనుక్కోవడానికి కూడా డబ్బులేకపోతే, నేలపై నీటితో శుభ్రం చేసుకుని ఆ నేలపైనే అన్నం వడ్డించుకుని తినేవారట. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి తనకు వచ్చిన పతకాలను అమ్ముకోవాల్సి వచ్చింది.

  నా పుట్టినరోజు ఇలా కాదు..

  రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొందరు విద్యార్థులు, ఆయన మిత్రులు సెప్టెంబర్ 5న ఆయన పుట్టినరోజు వేడుకలకు అనుమతించాలని అభ్యర్థించారు. దీనికి ఆయన నవ్వుతూ ‘నా పుట్టినరోజుకు బదులు ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవం జరిపితే బాగుంటుంది’ అని సూచించారు. అప్పటి నుంచి (1962) ఏటా రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినంగా దేశం జరుపుకొంటోంది.

  బహుమతి అలా వస్తే ఇలా ఇచ్చేశారు!

  ఈ తత్వవేత్త బోధన జీవితాన్ని పరిశీలిస్తే… మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో 1909లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేశారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వ కళాశాల, మైసూరు, కలకత్తా విశ్వవిద్యాలయాల్లో తత్వశాఖ అధ్యక్షులుగా కొనసాగారు. 1929లో మాంచెస్టర్ కాలేజీలో ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. అనంతరం ఆయన భారతదేశం తిరిగివచ్చి 1931 నుంచి 1936 వరకూ ఆంధ్రా యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేశారు. అదే ఏడాది, మళ్లీ 1937లో లిటరేచర్‌లో ఆయన నోబుల్ బహుమతికి నామినేట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన బెనారస్ హిందూ యూనివర్శిటీలో 1948 జనవరి వరకూ వైస్‌ఛాన్సలర్‌గా కూడా పనిచేశారు. వీరి అద్వితీయ ప్రతిభను గుర్తించిన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం 1989లో రాధాకృష్ణన్ పేరిట విద్యార్థులకు ఉపకారవేతనాన్ని కూడా అందజేస్తోంది. అంతకుముందు తనకు వచ్చిన టెంపుల్‌టన్ ప్రైజ్ బహుమతి మొత్తాన్ని విద్యా సేవల కోసం ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి ఇచ్చేశారంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో అర్థం చేసుకోవచ్చు.

  భోజనం ఎదురుగా ఉన్నా.. మంచినీరే తాగారు..

  తత్వవేత్తగా తనకున్న విశిష్ట జ్ఞానంతో ఎదుటివారు మైమరిచేలా గంటలకొద్దీ అద్భుత ప్రసంగాలు చేయడమే కాదు, తాను తెలుసుకోవాల్సింది ఉందనుకున్నప్పుడు తినడానికి ఎదురుగా భోజనం ఉన్నా ఆ సంగతి మరచిపోయి పక్కవారు చెప్పేది వింటూ ఆస్వాదించేవారు రాధాకృష్ణన్. ఒకసారి తన స్నేహితులైన హెచ్ జి వెల్స్, జోడ్, జేఎన్ సులివాన్ తదితరులతో కలసి రాధాకృష్ణన్ భోజనానికి కూర్చున్నారు. అందరూ తమ ఎదురుగా ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తూ శాస్త్రవిజ్ఞాన విషయాలపై మాట్లాడుతుంటూ రాధాకృష్ణన్ మాత్రం తన ఎదురుగా భోజనం ఉందన్న విషయం మరచి మంచినీరు తాగుతూ గంటల సమయం గడిపేశారట

  పూజారి కాబోయి రాష్ట్రపతి అయ్యారు…

  విద్యావేత్త, తత్వవేత్తగా విజయవంతమైన జర్నీ సాగించిన రాథాకృష్ణన్ ఆలస్యంగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1931లో లీగ్ ఆఫ్ నేషన్స్… కమిటీ ఫర్ ఇంటలెక్చువల్ కో-ఆపేరేషన్‌కు నామినేట్ అయ్యారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యూనెస్కోలో (1946-52) ఇండియాకు ప్రాతినిథ్యం వహించారు. అనంతరం సోవియన్ యూనియన్‌కు భారత రాయబారిగా 1949 నుంచి 1952 వరకూ పనిచేశారు. 1952లో భారత తొలి ఉపరాష్ట్రపతిగా ఆయన ఎన్నికయ్యారు. 1962 నుంచి 67 వరకూ భారత రెండవ రాష్ట్రపతిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన తన కుమారుడు ఏదైనా ఆలయంలో పూజారిగా స్థిరపడాలని తండ్రి కోరుకునేవారట. అయితే, కుమారుడి అద్భుత ప్రజ్ఞ చూసి చదివించాలని నిర్ణయించుకున్నారు. ఆ తండ్రి మనసు మారకుంటే మనం గొప్ప విద్యావేత్త, తత్వవేత్త అయిన ఈ ఉన్నతమైన వ్యక్తిని భారత రాష్ట్రపతిగా చూసి ఉండేవారం కాదేమో.

  పురస్కారాలకే వన్నె తెచ్చారు…

  ప్రతిభావంతులకు పురస్కారాలు మరింత వన్నెతెస్తాయి. అయితే పురస్కారాలకే వన్నె తెచ్చిన క్రెడిట్ రాథాకృష్ణన్‌దే. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం రాథాకృష్ణన్‌కు ‘సర్’ బిరుదు ప్రదానం చేసింది. 1963లో టెహ్రాన్ విశ్విద్యాలయం గౌరవ పీహెచ్‌డి, అదే ఏడాది నేపాల్‌లోని త్రిభువన్ విశ్వవిద్యాలయం గౌరవ డి.లిట్, 1963లో పెన్సిల్వేనియా యూనిర్శిటీ డాక్టర్ ఆఫ్ లా, 1964లో సోవియట్ యూనియన్ గౌరవ డాక్టరేట్ ఆయనకు ప్రదానం చేశాయి. బ్రిటన్‌లోని బకింగ్ హామ్ ప్యాలెస్ 1963లో ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ గౌరవ పురస్కారాన్ని రాథాకృష్ణన్ అందుకున్నారు. అన్నింటికీ మించి భారత ప్రభుత్వం ఆయనను దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ అవార్డును 1954లో ప్రదానం చేసి ఆ అవార్డుకే వన్నెతీసుకువచ్చింది. 1967లో రాష్ట్రపతి పదవి నుంచి విరమణ పొందాక మద్రాసులోని తన నివాసం ‘గిరిజ’లో ఆనందంగా గడిపారు. రాష్ట్రపతిగా మూడవసారి పదవిని నిర్వహించమని కోరినా వద్దన్నారు. 1975లో ఏప్రిల్ 17న 86 ఏళ్ల ప్రాయంలో రాధాకృష్ణన్ కన్నుమూశారు.