చంద్రయాన్-2 ప్రయోగంలో మరో కీలక ఘట్టం విజయవంతం

0
88

ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న చంద్రయాన్-2 ప్రయోగంలో మరో కీలక ఘట్టం విజయవంతమైంది. సోమవారం మధ్యాహ్నం ఆర్బిటర్ నుంచి విడివడిన విక్రమ్(ల్యాండర్) ప్రజ్ఞాన్(రోవర్) జాబిల్లి వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఇప్పటి వరకూ చంద్రయాన్-2 పూర్తి చేసుకున్న దశలన్నింటిలోకి ఇదే అత్యంత ప్రధానమైనది. జులై 22న చంద్రుడి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆర్బిటర్.. ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అనంతరం దాని కక్ష్యను ఐదు సార్లు తగ్గించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఆర్బిటర్ను చంద్రుడికి మరింత దగ్గరగా తీసుకెళ్లారు. సోమవారం మధ్యాహ్నం ఈ మొత్తం ప్రక్రియలోని కీలక ఘట్టం విజయవంతంగా పూర్తయింది. మధ్యాహ్నం 12.45 గంటలకు మొదలైన ఈ దశ.. 1.15 గంటలకు ఆర్బిటర్ నుంచి ల్యాండర్, రోవర్లు విడిపోవవటంతో పూర్తయింది.

సెప్టెంబర్ 7న మొత్తం చంద్రయాన్-2 ప్రయోగంలోనే అత్యంత కీలక ఘట్టం ప్రారంభమవుతుంది. ఆ రోజున చంద్రయాన్-2లో పవర్ డిసెంట్ దశ ప్రారంభమవుతుంది. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న విక్రమ్, దాదాపు 15 నిమిషాల పాటు ప్రయాణించి చంద్రుడి దక్షిణ ధృవంపై నిర్దేశించిన ప్రాంతంలో దిగనుంది. అనంతరం ల్యాండర్లో నుంచి రోవర్ బయటకు వస్తుంది. ఈ 15 నిమిషాలనే అత్యంత ఉత్కంఠతను కలిగించేవిగా ఇస్రో పేర్కొంది. ఆర్బిటర్ మాత్రం మరో ఏడాది పాటు చంద్రుడి చుట్టూ తన పరిభ్రమణాన్ని కొనసాగిస్తుంది.