గవర్నర్ మార్పుతో తెలంగాణాలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా..?

Soundararajan As New Governor Of Telangana

0
111

తెలంగాణ రాష్ట్రానికి సుదీర్ఘ కాలం పాటు నరసింహన్ గవర్నర్ గా ఉన్నారు. గతంలో ఐపీఎస్‌ అధికారిగా తెలుగు రాష్ట్రాలలో పనిచేసిన గవర్నర్‌ నరసింహన్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్నప్పుడూ, బీజేపీ అధికారంలో వున్నప్పుడూ.. తనపై కేంద్రం ఉంచిన నమ్మకాన్ని ఆయన వమ్ము చేయలేదు. ఎంతో బాధ్యతతో వ్యవహరించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌, రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ.. ఇంకా అనేక ఇతర రాజకీయ పార్టీలు నరసింహన్‌పై ఎన్ని విమర్శలు చేసినా చిరునవ్వుతో సర్దుకుపోయారు. కేంద్రానికి తాను ఏం చెప్పాలనుకున్నదీ ఎప్పటికప్పుడు చెప్పడం ద్వారా, కేంద్ర ప్రభుత్వ పెద్దల మనసుల్ని గెల్చుకున్నారాయన. గవర్నర్‌ అంటే రబ్బర్‌ స్టాంప్‌.. అన్న ముద్ర చెరిపేసి, జనంలోకి పలు సందర్భాల్లో దూసుకొచ్చి.. జనంతో మమేకమై, జనం తరఫున మాట్లాడారు.

ఇప్పుడా నరసింహన్‌ని కేంద్రం తప్పించింది. తొలుత ఆంధ్రప్రదేశ్‌ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేసి, తాజాగా తెలంగాణ నుంచి కూడా ఆయన్ను సాగనంపారు. నరసింహన్‌ స్థానంలో తమిళిసై సౌందర రాజన్‌ని తెలంగాణకు కొత్త గవర్నర్‌గా తీసుకొచ్చింది కేంద్రం. బీజేపీ తరఫున తమిళనాడులో అత్యంత యాక్టివ్‌గా వుంటూ వచ్చిన సౌందర రాజన్‌ని తెలంగాణ గవర్నర్‌గా కేంద్రం నియమించడం పట్ల ఆసక్తికరమైన అభిప్రాయాలు రాజకీయ పండితుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

త్వరలో తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయనీ, తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ఇది ఓ ఎత్తుగడ అనీ కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, గవర్నర్‌ పదవి రాజకీయాలకతీతమైనదని కొత్త గవర్నర్‌ చెబుతున్నారు. తెలంగాణకు గవర్నర్‌గా కేంద్రం తనను నియమించినందుకు ఆనందంగా వుందని చెప్పారామె. మరోపక్క, బండారు దత్తాత్రేయను హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్ గా నియమించారు.