ఖైరతాబాద్ గణనాధుడికి అరుదైన గుర్తింపు.. ఏమిటంటే..

    వినాయక చవితి అనగానే తెలుగువారికి గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే.

    0
    89

    వినాయక చవితి అనగానే తెలుగువారికి గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే. ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో ఖైరతాబాద్ గణపతి దర్శనమిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఖైరతాబాద్ వినాయకుడు మరో ఘనత సాధించాడు. దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా అరుదైన గుర్తింపు సాధించింది.

    అయితే.. ఈ ఏడాది 61 అడుగుల ఎత్తులో ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా ఖైరతాబాద్ గణపతి దర్శనమిస్తున్నారు. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో.. 61 అడుగుల ఎత్తులో భారీ గణపతి రూపుదిద్దుకున్నాడు. వినాయ‌కుడి కుడి వైపున మహా విష్ణువు, ఏకాదశి దేవి.. ఎడమ వైపున బ్రహ్మా, విష్ణు, మహేశ సమేత దుర్గాదేవి కొలువదీరారు. ఒక్కో తలకు ఒక్కో రకమైన రంగుతో గ‌ణ‌నాథుడు రూపుదిద్దుకున్నాడు. ఈ రూపంలో వినాయకుణ్ని పూజిస్తే సకాలంలో వర్షాలు పడి, అందరికీ మంచి జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.

    తొలిసారిగా 1954లో ఒక్క అడుగు ఎత్తుతో ఏర్పాటుచేసిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ప్రతి ఏటా అడుగు చొప్పున పెంచుతూ 2014 నాటికి 60 అడుగులకు చేరింది. తర్వాత ఒక్కో అడుగు తగ్గించుకుంటూ వచ్చినా ఈ ఏడాది 61 అడుగులు భారీ విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహం రూకల్పనలో పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన 150 మంది నాలుగు నెలలపాటు శ్రమించారు. మొత్తం రూ.కోటి రూపాయలు ఖర్చుచేశారు. ఈ 11 రోజుల పాటు ఖైరతాబాద్‌ గణేశుని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత చర్యలు చేపట్టారు.